Friday, January 22, 2010

తెలంగాణ వచ్చాక ?

ఈ మధ్య మా వూర్లో నే తెలంగాణా వాళ్ళ సభ జరిగింది కొంత మంది మేతావులు (చందాలు మెయ్యడమే వ్రుతిగా వున్న కళాకారులు)తెలంగాణా వచ్చాక ఈ ఆధ్రోళ్ళ్ ని వెళ్ళ గొడదాం అడ్డొస్తే పీక కోస్తం అంటూ ఒకటే వాగుడు వూర్లో వున్న ఒక్క వెధవ నోరెత్తితే వట్టు ప్రతి ఇంటినుంచీ రియల్ ఎస్టే ట్లో కోట్లు సంపాదించిన తెలంగాణా వాళ్ళే ఇప్పుడు తరిమేస్తాం చంపుతాం ఆంటూ జనాలని భయభ్రాంతులకి గురిచేస్థున్నారు. జీతం రాళ్ళు వెనకేసుకుని ఏదో గూడు కొసం వీళ్ళ చేతులలో అలవిమాలిన ధనం పోసాము ఇప్పుడు డబ్బు మదంతో రెచ్చి పోతున్నారు. పోయిన వారం లో కూడా ఒక సమావేశం లో కొందరు మిత్రులు( అందరూ తెలంగాణా వాళ్ళే ) తో జరిగిన సంభాషణ
అసలు మీ నాయకులు ఇక్కడి వాళ్ళు ఇక్కడే వుంటారు అని వాళ్లకి రక్షణ కల్పిస్తాం అంటూంటే మీరు ఎలా వెళ్ళగొడ్తారు అని అడిగా
వాళ్ల సమాధానం .. ఈ రాజకీయ బాడ్కావుల సంగతి ఎందుకే మేము అమ్మిన భూముల ను తిరిగి లాక్కుంటాం
అదే ఎలా ?
మతకలహాల్లో పాత బస్తీ లో ఎమి జరిగిందో తెలుసా? ఇంటికి ఒక్కళ్ళని వేసేసారు అప్పుడు మన హిందువులంతా లక్ష ల ఖరీదు చేసే ఇళ్ళని వేలకి అమ్మేసుకుని పోయారు మళ్ళి అదే రిపీట్ అవుతుంది కాకపోతే ఈ సారి అంధ్రా వాళ్ళమీద అయ్య దీని బట్టి మనకి తేలేదేమంటే కొటి రూపాయలకు ఎకరం కాడికి అమ్ముకున్న వెధవలంతా ఇప్పుడు వాళ్ళ భూములు తిరిగి ఎలా గుంజాలో ప్లాన్ చేసుకుంటున్నట్టు అర్థం అవుతుంది. కవితమ్మ గారు టీ వీ 9 లో ఇప్పటికే ఒక స్టేట్మెంటు ఇచ్చారు దాని ప్రకారం " ఏ ఉద్యమకారుడికైనా ఒళ్ళుమండి శాంతియుతంగా మీ ఆస్తులు తగలెడితే లేక ఒక పోటు పొడిస్తే అది వాళ్ళ అగ్రహం తెలియజేస్తున్నారు" అనుకోవాలే తప్ప మనని దోచుకోవటానిక్కాదు.వాళ్ళని ఎవరూ కంట్రోలు చెయ్యలేరు ఎగ దొయ్యటమే మా పని తరువాత మేము బాధ్యతవహించం) ఈ అసమర్థుని రాజ్యం లో బతకనీకొచిన ఒక సగటు జీతగాడి వెనుక ఎంత కుట్రలు అప్పనంగా వాడి సర్వస్వం దోచుకుందామని ఎన్ని కుతంత్రాలు
దేవుడా నాకేది ఈ తెలబాన్ల నుంచీ రక్షణ?

Wednesday, June 25, 2008

మానవ మృగాలు

ఈ మధ్య పాఠశాలల్లో పిల్లలకి ముఖ్యంగా ఆడపిల్లలకి ఇలా చెప్పాలి టీచర్లు " మీరు చాలా అప్రమత్తంగా వుండాలి ఎందుకంటే మానవ ముఖం తొడుగుకుని కొన్ని మృగాలు సమాజంలో తిరుగుతున్నాయ్ మీరు మీ జాగ్రత్తలో వుండండి"
కాప్రా మునిసిపల్ ఏరియాలో నాలుగు రోజులక్రితం చాక్లెట్లు కొనుక్కోవడనికి ఇంటి ప్రక్కన వున్నషాపుకి వెళ్ళిన ఏడు సంవత్సరాల పాపని కారులో వచ్చిన మూడు మృగాలు కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకుపోయి పాడుచేసేసారు ఆ పసి పాప ఇప్పుడు కోమాలో నే వుంది ఆ పాప బ్రతకాలంటే యుటిరస్ బాగా దెబ్బ తిన్నది తీసివేయాలని డాక్టర్ల మాట.ఆ పాప వున్న పరిస్థితి తలుచుకొంటే మనం సమాజంలోనే వున్నామా అన్న సందేహం కలుగుతుంది.
ఇలాంటి మృగాలని శిక్షించడానికి వురి శిక్ష కన్నా ఇంకా కఠిన మైన వేమన్నా వుం టే బాగుణ్ణు.అరబ్ కంట్రీస్ లో లా గ కంటికి కన్ను లాంటివి మన దేశంలో కుడా పెడితే నే గాని ఇలాంటి దారుణాలు ఆగవు.నేరం చేయ్యాలంటే నే గజ గజ వణికే రోజులు రావాలి.ఇలాంటి వెధవల్ని బహిరంగంగా వురి వేస్తే గానీ పోకిరీ మూకల ఆగడాలు ఆగవు.కానీ మన దేశం లో సాధ్య పడుతుందా ఈ రాజకీయ నాయకులు సాధ్యపడనిస్తారా అన్నదే సందేహం నడుస్తున్న బస్సులో పెట్రోలు పోసి జనాలని అ కారణం గా చంపేసిన వాళ్ళ కే సమాజం నుంచీ బొల్డంత వత్తాసు
వాళ్ళు తక్కువ కులం వాళ్ళు కాబట్టి వాళ్ళ వురి శిక్ష ని తగ్గిం చాలని.ఎందుకంటే చని పోయింది ఆ కుల సంఘం నాయకుల తల్లో చెల్లో కాదుగానేను తక్కువ కులం వాడిని కాబట్టి లేదా మైనారిటీ వర్గం కాబట్టి నాకు శిక్ష తక్కువ పడుతుంది. లేదా నా వర్గం వాళ్ళు చేసే ఆందోళనకి రాజకీయనాయకులే నన్ను తప్పిస్తారు ( నా వర్గం వాళ్ళ వోట్లా మజాకా)అన్న భావన వున్నంత కాలం ఇలా బజారులో బహిరంగంగా ఆడపిల్లల్ని బలవంతంగా ముద్దు పెట్టుకోవడం, లేదా కిడ్నాప్లు చెయ్యడం లు జరుగుతూనే వుంటాయి.అందుకే నేరాన్ని నేరం గానే చూడండి. వాడు దళితుడా , వాడు మైనారిటీ యా లాంటి వి చూడొద్దు.కుల సంఘాల అనవసర ఆర్భాటాలకి మద్దత్తు ఇవ్వొద్దు

Monday, April 21, 2008

దున్నపోతు అన్నం తింటూదా?

అసలు ఈ తిండి,దాని వెరైటీలు, కాంబినేషన్లు ఇలాంటి గొడవ నాకు ఏ మాత్రం పట్టదు.చిన్నప్పట్నుంచీ కూడా ఇంట్లో ఏది వండితే అది తినడమే కానీ నాకు ఇది కావాలి అని ఎప్పుడూ మారాము చెయ్యలేదు.ఇప్పుడు కూడా మాశ్రీమతి ఏది వండితే అది తినిపెడ్తుంటాను.(శాకాహారం మాత్రమే)నాకు మాంసాహారం అలవాటు లేదు. తనకి ముక్కలెనిదే ముద్ద దిగదు అని కాదు కానీ దాదాపు వారానికి 4 సార్లు తినే అలవాటు. నాకేమో వంటింట్లో వండుతుంటే బాత్రూంలో బెక్ బెక్. అందుకని పాపం నాన్ వెజ్ వంటకాలకి బంద్ పెట్టింది.(త్యాగమయి)కానీ అప్పుడప్పుడూ మా పాలకొల్లులో సముద్రం చేపలు, మంచి నీటి చేపలు అబ్బ ఎంత బాగా దొరికేవో మిమ్మల్ని చేసుకున్నాక వాటిని తినే అద్రుష్టం దూరమైంది అంటూ దెప్పి పొడుస్తూ వుంటుంది.ఇంక పిల్లలు వాళ్ళు మాత్రం ఏదీ సరిగా తినరు.ఈ సమ్మర్ లో బాగా నీళ్ళు త్రాగుతూ తిండి తగ్గించేసారు. కొద్దిగా పొట్టలో ఖాళీ వుంటే దానిని కుర్కురె, లేస్, 5 స్టార్ లాంటి వాటితో నింపేస్తున్నారు.మా బాబు అయితే మరీ బక్కచిక్కి పోయాడు.అయితే నిన్న సాయంత్రం డాడీ ఈ వాల సండే కద లేస్ కొందాం పద (ఒకప్పుడు సండేస్ మాత్రమే లేస్ అని ఒక రూల్ పెట్టా) అంటూ మొదలెట్టారు. నాకు బాగా కోపం వచ్చింది. ఎప్పుడూ ఆ గడ్డి తింటూ నే వుంటారా ? అన్నం మానేసి ?అని గద్దించా.వెంటనే మా అమ్మాయి సమాధానం"నువ్వెప్పుడూ మమ్మల్ని అడ్డ గాదిదల్లారా, దున్నపోతుల్లారా అని అటూంటావుగా దున్నపోతులు అన్నంతింటాయా అందుకే గడ్డి కొనిపెట్టు" నాపర్సులో వంద నోటు దున్నపోతు కి గడ్డి మోపైందని వేరే చెప్పాలా

Sunday, December 23, 2007

పార్కులూ , మీటింగ్ ప్లేసులూ

పార్కు, ఈ మాట తలచుకోగానే యుక్తవయస్సులో నున్న యువతీ యువకుల లొ యేదో తెలియని పరవశం .పదహారేళ్ళ సింగినాథం లకి, పద్నాలుగేళ్ళ వెంకటలచిమి లకీ అదే మీటింగ్ పాయింటు.క్లాసులకి డుమ్మా కొట్టి పార్కుల వెంట తిరిగే ప్రేమికుల జంటలూ , వాళ్ళ వెనుకాలే చిల్లర కొసం వచ్చే పోలీసు మామలూ,అప్పుడప్పుడూ మా అత్తరు వాసనల్ని చూడమంటూ వెంటపడే మునిసిపాలిటీ ముద్దు బిడ్డలూ (పందులూ)మధ్య మధ్య లో అభినవ లైలా మజ్ఞూ లని విసిగించే వేరుశనగ పప్పులూ, బటానీ లూ అమ్ముకునేవాళ్ళూ, ఎప్పుడో ఒక్క సారి మూతి మీద మైక్ పెట్టి హై హాల్లో లవ్ మీద మీ ఒపినియన్ ఏంటి, అర్యూ ఇన్ లవ్, హౌ మేనీ యియర్స్ నించీ లవ్ చేసుకుంటున్నారు, మీ స్వీట్ హార్ట్ కి మీ రిచ్చే మెస్సేజ్ ఏంటి..అంటూ అర్థం పర్థం లేకుండా తైతక్క లాడుతూ డాన్సు లు వేసే తెలుగు టి వి ఆంకరమ్మలూ,ఇంట్లో పెద్దవాళ్ళకి తెలియకుం డా బిక్కు బిక్కు మంటూ మెదటి సారి వచ్చే ప్రేమికుల జంటలూ,వీటన్నిటికీ అలవాటు పడిన దేశముదుర్లూ , వీటి తో మహా రంజు గా వుంటాయి.కాలక్షేపం కొసం బుడ్డాళ్ళని పార్కు కి తీసుకెళదాం అనుకుంటే మన వారసులు ఈ పార్కు ల గాలి సో కి భవిష్యత్తులో ఏ వ్యాధి బారిన పడతా రో నన్న భయం చివరకు ఆదివారం సాయంత్రాలని టి వి కి అతుక్కుపోయేటట్టు చేస్తున్నాయి.ఈ గోల సరే ఈ మధ్య కాలంలో మరిన్ని మీటింగ్ పాయింట్లు కొత్త్తగా పుట్టుకొచ్చాయి.ఇవి అలాంటిలాంటివి కాదు. వాటి గురించి తరువాత.....

Monday, November 19, 2007

ఇది కౌరవ సభ ?

మొన్న ఆదివారం ఇంట్లో హాయిగా టివి చూడకుండా పిల్లలతో కాలక్షేపం చేద్దాం అనుకుంటే ఉరుము లేని పిడుగు లాగ నా శ్రీమతి ఒక సారి మండలాఫీసుకి వెళ్ళాలి నాకు జనరల్ బాడీ మీటింగ్ వుంది అని ఒక ఆర్డినెన్స్ పాస్ చేసేసింది.(ఆర్దినెన్స్ పదం కరక్టే నంటారా )ఇక తప్పేదేముంది ఆదివారం ఇంట్లో వుంటే ఆడవాళ్ళకి లొకువ అనుకుంటూ సారథి కొలువు చేపట్టి బండి తీశా.మండలాఫీసులొ మహా జొరుగా వాగ్వివాదాలు జరుగుతున్నాయి.బయట మాత్రం పదిమంది రక్షకభటులు పొగ సేవిస్తూ తన్మయత్వం లో ఉన్నారు. ఇంతకు ముందెన్నడూ అంత సిబ్బందిని అక్కడ అలా చూడలా కుతూహలం అపుకొలేక మీరు ఇంతమంది వచ్చారు మినిష్టరు గాని మీటింగ్ లో వున్నారా అని అడిగా .వాళ్ళు ఇచ్చిన సమాధానం విని దిమ్మ తిరిగిపోయింది. "ఏమీ లేద్సార్ ఈ మధ్య సర్పంచులు ఎవరిని బడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్లు సభలో కొడుతున్నారు. అందుకే వుద్యోగస్తులకి రక్షణ గా వచ్చాం "అన్నారు. ఔరా హతవిథీ గవర్నమెంటు ఉద్యోగస్థులకి ఎమి కష్టం వచ్చిందీ చివరకు రాజకీయనాయకుల (రాజకీయ గూండాలు ?)నుంచీ రక్షణ కోరవలసి వచ్చిందన్నమాట అనుకున్నా. ఏదో సినిమాలో డైలాగ్ "తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది రౌడీ ముదిరితే రాజకీయనాయకుడు అవుతాడు" గుర్తొచ్చింది.

Friday, November 16, 2007

రాదారీ నీ కేది దారి

నేను హైదరాబాదు వచ్చి ఉద్యోగం చేస్తున్న కొత్తలో ప్రతి సంవత్సరం సంక్రాంతి సెలవులపుడు మావూరు వెళ్ళే వాడిని.ఓసొస్ ఇంతేనా మేము ఆమాట కొస్తే ప్రతి ఆంధ్రావాడు అంతేలేవొయ్ పుల్లాయ్ అనుకుంటున్నారా ?నేను అందరిలా కాదు. ఫ్రగతికి చిహ్నం చక్రాల బండి మీద వెళ్ళేవాడిని కాదు. నా కీలుగుర్రం మీద మాత్రమే వెళ్ళేవాడిని.నాలుగు రోజులు ముందుగానే హడావుడి మొదలయ్యేది.బండి మెకానిక్ కి ఇచ్చి సర్వీసు చేయించడం కర్బొరేటర్ చూసావా? జెట్ సరిగా సుబ్రం చేసావా ? మైలేజ్ 55 రావాలి అంటూ పిచ్చి పిచ్చి షరతులు పెట్టడం అలా అతని బుర్ర వీలున్నంత తినడం మహా సరదా గా వుండేది.ఈ బాలు గాడి బండి మళ్ళీ జన్మలో చేయకూడదు అని మా మెకానిక్కు మావయ్య
చిరాకు పడుతూనే మొత్తానికి నాబండి మాత్రం అదిరిపొయే లాగా చేసేవాడు.(ఈ అదురుట అనునది చూపులకు మరియు పరుగులకు మాత్రమే అని గ్రహించవలెను.)ఇక వూరికి ప్రయాణం అయ్యే రొజు సరే సరి జేబు నిండా డబ్బులు బండి నిండా తైలం తో మహా పైలా పచ్చీసు వ్యవహారం ఆ రోజు ప్రొద్దుట్నుంచే ఎవరైనా నాతో తోడుగా వస్తారా అని అందరినీ విసిగించే వాడిని.చివరకు వాళ్ళు నువ్వు వెంటనే వెళ్ళకపొతే మేమందరం కలిసి ఉతుకుతాం అనేంతవరకు ఉండేది వ్యవహారం.(ఇది మాత్రం వారిని ఇబ్బంది పెడదాం అని కాదు హై వే ప్రయాణం మన ఇష్టం వచ్చినట్లు అనేది ఎంత బాగుంటుందో తెలియజేయాలని).సాయంత్రం ఎనిమిది అవుతూండగా చివరకు నేను ఒక్కడినే బయలుదేరేవాడిని అందరూ రాత్రి జర్నీ వద్దురా బాబూ అంటూన్నా వినేరకం కాదు మరి.నిదానంగా ఉప్పల్ రింగురోడ్డు తిరిగి నాగొలు వరకు వచ్చే సరికి 9:00 అయ్యేది అక్కడ దాభా లో నాకిష్టమైన రోటీ పనీర్ బటర్ మసాలా తో ఆరగించి మళ్ళి మొదలయ్యే సరికి రాత్రి 10:00 అయ్యేది.ఎల్ బి నగర్ చౌరస్తా మలుపు తిరగ్గానే ఏదో చెప్పలేని అనందం చాన్నాళ్ళ తరువాత కనబడిన ప్రాణస్నేహితుడిని చూసినట్లుగా అనిపించేది.అప్పుడు కొంచెం కొంచెం గా చలి మొదలయ్యేది.జర్కిన్ వేసుకుని ఆక్సిలరేటరు ఒక తిప్పు తిప్పానంటే బండి మబ్బుల్లో తేలిపోతుండేది.వూరు దాటగానే హై వే మీద మంచి ద్రాక్ష పళ్ళ కోసం వేట కొంచెం పచ్చిగా వున్న వాటిని కొని జాగ్రత్తగా డిక్కీ లొ పెట్టి మరల ప్రయాణం షురూ.సుర్యాపేట లో టీ కొసం కాసెపు ఆగే వాడిని.జివ్వుమని చలిగాలి నరాలను మెలిపెడుతుంటే మరల ప్రయాణం మొదలు.దారి మధ్యలో ప్రమాదానికి గురైన బండ్లు వళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్ళరా అబ్బీ అని గుర్తు చేస్తుండేవి.మధ్య మధ్యలో విఠలాచర్య సినిమాలో గాలిలో తేలే దెయ్యాల మాదిరిగా మంచు తెరలు తెరలు గా పలకరిస్తుండేది.చివరకు 5:30 6 :00 గంటల మధ్యలో మధ్యలో తెనాలి చేరేవాడిని.ఇ వన్నీ యుక్త వయస్సు తీపి గురుతులు అందుకే కొత్త బైక్ కొన్న తరువాత కూడా నా పాత స్కూటరు ని అలాగే వుంచేశాను.మా స్నేహితులు చాలామందికి దాని మీదే మొదటిసారి టూ వీలర్ నడిపిన అనుభవం.

ఐతే ఈ మధ్య విజయవాడ జాతీయ రహదారి దుస్థితి చూస్తే చాలా బాధ వేస్తుంది. గాయాల పాలయి చివరిదశలో వున్న స్నేహితుడిని చూసినట్లుగా మనసంతా వికలం అయిపోయింది.దాదాపు 375 కిలోమీటర్ల పొడవున 12 జిల్లాల వారిని రాజధానికి చేర్చే ఈ రహదారి చాల చోట్ల గ్రామాలలో పొలాలకివెళ్ళే డొంక రోడ్ల కన్నా అధ్వాహ్నంగా తయారయ్యింది.ఈ గతుకుల దారి లో ప్రమాదాలు చాలా ఎక్కువయ్యాయి రహదారి రక్తసిక్తం కాని రోజు అంటూ లేదు.ఒ కప్పుడు ఆడతా పాడతా తిరిగిన దారేనా ఇది అని అనిపిస్తుంది.మా రహదారిని బాగు చెయ్యండ్రా మొర్రో అని మనం కెంద్రాన్ని మొత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పొరుగు రాష్ట్రంలో గంటకు 200 బండ్లు అయునా తిరుగని రహదారులకి కోట్లు ఖర్చు పెడుతూ మనకు మాత్రం మొండిచేయి చూపిస్తున్నారు.ఇప్పటికైనా పేరుగొప్ప రాజకీయ నాయకులందరు రాజకీయాలకు అతీతంగా ఏకమై మన జాతీయ రహదారిని బాగుచేసుకోవటానికి ప్రయత్నం చేయాలి.లేక పోతే మన జాతీయ రహదారి దారి గతి గోదారే.

Friday, October 19, 2007

అల్లరి దయ్యం

అవి నేను ఉయ్యూరు లో ఐ.టి.ఐ వెలగబెడుతున్న రోజులు. కొన్ని రోజులు మామయ్య వాళ్ల ఇంట్లో నే వున్నా. తరువాత వాళ్లు విజయవాడ వెళ్లడంతో బయట స్నేహితులతో వుండాల్సి వచ్చింది.ఒక రోజు మా వేంకట రమణ సినిమాకి వెళ్లదాం రా రా సన్నాసీ అని లాక్కు వెళ్ళాడు.పెద ఓగిరాల లో అనుకుంటా నాకు సరిగా గుర్తు లేదు క్రొత్త హాలు కట్టారు. రెండవ ఆట శ్రీకృష్ణ పాండవీయం సినిమా కి బయలుదేరాం సైకిలు మీద ఇద్దరం.ఉయ్యూరు నుండీ దాదాపు 5 కిలోమీటర్లు దూరం ఉంటుంది.చెరకు ఆడే సమయం కావడంవల్ల బాగా రద్దీ గా వుంది దారంతా.సినిమా మోజులో సరదాగానే త్రొక్కుకుంటూ వేళ్ళాం.తిరిగి వచ్చే టప్పుడు హిడింబి,రాక్షసులు అంటూ ఏవే వో మాట్లాడుతూ వస్తున్నాం.ఇంత లో మా ముందు వెళుతున్నచెరకు ట్రాక్టరు ఒక్కసారిగా బ్రేక్ వేయడం మేము రోడ్డు దిగువన చింతచెట్టు (అనుకుంటా చాలా పేద్దది గా వుంది) దాపులో పడిపోవడం జరిగింది.ఒళ్ళంతా కొట్టుకు పోయింది చెప్పులు తెగి ఎక్కడో పడిపోయాయి.తరువాత రోడ్డు మీద పడిపోయిన సైకిలు తీసి త్రొక్కడం మొదలెట్టాను మా వేంకట రమణ మీద నమ్మకం పోయింది అప్పటికే.విచిత్రం గా ఎంత త్రొక్కినా సైకిలు కదలడం కష్టంగా వుంది.దానితో చిన్నప్పుడు విన్న దెయ్యాల కధలన్నీ ఒక్క సారిగా గుర్తుకు రాసాగాయి.మా వేంకట రమణ హనుమంతుడి భక్తుడు మహామొండి ధైర్యం కలవాడు.దెయ్యం లేదు నీ మొహం లేదు నీకు దెబ్బలు తగలడం వల్ల నీరసమైపోయావు అంటూ వాడు సైకిలు త్రొక్కటానికి ముందుకు వచ్ఛాడు.మళ్లీ అదే విచిత్రం వాడికి కూడా సైకిలు కదలడం లేదు.దానితో ఇది దయ్యం పనై వుంటుందని గుండె జారిపొయ్యింది.(అంగలకుదురు ప్రైవెటు లో రాత్రంతా నిద్రపోకుండా స్నేహితులు చెపుతుంటే విన్న దెయ్యం కధల మహాత్యం).ఇంకా రాత్రి సైకిలు నడిపించుకుంటూ మొత్తం మీద ఇంటికి చేరాము. అప్పటి కే వణుకుతూ జ్వరం తెచ్చుకున్న నన్ను వాడు రూములో వదిలేసి రూములోని మిగతా వారికి జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు .బారెడు తెల్లారింది కాని నేను మాత్రం లేవలా నాజ్వరం, వణుకుడు ఇంకా ఎక్కువయ్యాయి. ఆ రోజు క్లాసు కి డుమ్మా కొట్టేసా. స్నేహితులందరూ మందులు ఇచ్చి టీ త్రాగించి క్లాసుకి వెళ్ళిపొయ్యారు.మధ్యాహ్నం వేళకి బాత్ రూం కి వెళ్ళటానికి లేచాను. బయట బాత్ర్రూం కి వెళ్ళి వచ్చెటప్పుడు గోడవారగా నిలబెట్టిన సైకిలు మీదకి దృష్టి మళ్ళింది. అప్పుడు కనపడింది రాత్రం తా నన్ను వణికింపజేసిన దెయ్యం. వెనుక టై రు కి , మడ్ గార్డు గి మధ్యలో ... నా తెగిపొయిన చెప్పు ముక్క. వెంటనే తీసి పారేశాను లేకపోతే నా ధైర్యసాహసాల గురించి కధలు కధలు గా వస్తాయు కాలేజ్ లో అని. ఇంతకీ దెయ్యం ఆ చెట్టు మీదే వుందని మా కొందరి స్నేహితుల నమ్మకం.